వాలుజడ, మల్లెపూల జడ…ఇక్కడ దొరుకును కదా..

పెళ్లంటే.. పందిళ్లు సందళ్ళు చప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు అన్నాడో సినిమా కవి.

అయితే పెళ్లంటే కేవలం మూడు ముళ్లు ,ఆరు అడుగులు మాత్రమే కాదు..పట్టు చీరలు, పూల జడలు అని కూడా కలుపుకోవాలి. ముఖ్యంగా ఎంత పేద పెళ్లి అయినా ఎంత గొప్పింటి పెళ్లి అయినా ఎలాంటి సంప్రదాయంలో వివాహం జరుగుతున్నా పూల జడ మాత్రం కామన్. పెళ్లి కూతులు కొప్పులో ఒదిగిపోయి.. పెళ్లి శోభను ద్విగుణీకృతం చేసే పూలజడ లేని పెళ్లిని ఊహించలేము. అంతెందుకు వజ్రాలతో ఒదిగిన ఆభరణాలు తో పెళ్లి కూతురుని అలంకరించినా .. కొప్పులో ఉన్న గుప్పెడు మల్లెలు, అందంగా తీర్చిదిద్దిన పూలజడ లేనిదే నిండుతనం రాదు. రోజూ జీన్స్, టీషర్ట్స్‌లో కనిపించే సిటీ అమ్మాయిలు సైతం.. పెళ్లి వంటి వేడుకల్లో పొడవాటి పూలజడతో మెరిసిపోతూ మురిసిపోతూంటారు. చిక్కుపడకుండా, ఎక్కడపడితే అక్కడ రాలకుండా, అందంగా ఉండేలా కొన్ని వెంట్రుకలను పాయలుగా విడదీసి, జడగా అల్లుతారు. ఆ జడకు రకరకాల పువ్వులతో అందాలను పేర్చుతారు. అమ్మాయి పూలజడతో ముస్తాబు అయ్యిందంటే వేడుకకు సిద్ధమైనట్లే. సంప్రదాయ తరహా పూలజడల్లో … మల్లెమొగ్గలు, కాడమల్లె, కనకాంబరాలు, మరువం… పువ్వులను మాత్రమే ఉపయోగిస్తూంటారు. మోయడానికి కాస్త బరువుగా ఉన్నా కాని, చూడటానికి అందంగా ఉంటాయి. అయితే ఈ పూల జడ వేయటానికి ఆ రోజుల్లో మనందరి ఇళ్లలో పెద్ద వాళ్ళు ఉండేవారు. రోజులు మారాయి. అవసరం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలో పూల జడ కాస్తా.. ఇప్పుడు ‘బిజినెస్ ఐటెమ్’గా మారింది. ఆన్‌లైన్‌లో కొత్త ట్రెండ్ గా మారింది. అలా మనకోసం ఏర్పాటయ్యిందే పెళ్లి పూలజడ డాట్‌కామ్! ఈ క్రియేటివ్ ఆలోచన క్రియేటర్ కల్పన. మొదటగా హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో ప్రారంభించిన ఆమె ఇప్పడు ఈ సేవలను నగరమంతటా విస్తరించారు. సికింద్రాబాద్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, కాచిగూడలలో కూడా బ్రాంచెస్ ఏర్పాటు చేశారు.ఒకటికాదు రెండుకాదు.. దాదాపు 103 రకాల పూలజడలను తయారుచేస్తున్నారు. ఒక్కో జడకు ఒక్కో కోడ్ నంబరు ఇచ్చి రెడీ చేస్తున్నారు. ఖర్చు పెట్టేవారి అభిరుచిని బట్టి ఒక్కో పూలజడ ధర వెయ్యి నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఒక్కో పూలజడ అల్లడానికి నాలుగు గంటలు పడుతుంది. వీటి కోసం పూలను గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి తెప్పించుకుంటున్నారు. ఒక అద్దె ఇంట్లో మొదలైన పెళ్లి పూలజడ ప్రస్థానం కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే కాదు… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల తోపాటు తమిళనాడు, ఢిల్లీ ముంబై, యూఎస్‌లలోనూ విస్తరించింది . ఇప్పుడు కల్పన దగ్గర దాదాపు 200 మంది వరకూ పనిచేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే దాదాపు 400 మందికి పనిదొరుకుతోంది. వాళ్లు చేసుకునే పనిని బట్టి నెలకు ఒకొక్కరూ కనీసం రూ.5 వేల నుంచి 20 వేల వరకూ సంపాదించుకుంటున్నారు. గ్రేట్ కదా.